తెలంగాణలో మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. రెండేళ్లకోకసారి మేడారం మహాజాతరను నిర్వహిస్తారు. ఈ ఏడాది మేడారం మినీ జాతర జరగగా, వచ్చే ఏడాది మేడారం మహా జాతర జరగనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారులు ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 14న (మాఘ శుద్ధ పంచమి) మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెల మీదకు చేరుకుంటారు. ఫిబ్రవరి 22న (మాఘ శుద్ధ త్రయోదశి) చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటుంది. ఫిబ్రవరి 23న (మాఘ శుద్ధ చతుర్దశి) సమ్మక్క-సారలమ్మలకు భక్తులు మొక్కులు చెల్లించుకోవడానిక అవకాశం కల్పించగా 24న (మాఘ శుద్ధ పౌర్ణమి) దేవతల వనప్రవేశం ఉంటుందని పూజారులు తెలిపారు.