అతిగా నిద్రిస్తున్నారని కన్న బిడ్డలపై ఆ తల్లి దారుణానికి ఒడిగట్టింది. తల్లి వేడి చేసిన నీరు పోయడంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం అల్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రితిక (9), శ్రీనిత్య (6)లకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎ. సంతోషి తన కుమార్తెలు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారని, పాఠశాలకు ఆలస్యంగా వెళ్తుండటంపై ఆగ్రహంగా ఉంది. త్వరగా నిద్రలేవాలని పదే పదే హెచ్చరించినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లి సంతోషి విసుగు చెందింది.
కోపంతో ఆమె వారిపై వేడి నీటిని పోసింది. దీంతో పిల్లలు కేకలు వేస్తూ లేచారు, కాలిన గాయాలతో వారు నొప్పిని తట్టుకోలేకపోయారు. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. చిన్నారులు అప్పటికే నొప్పితో కొట్టుమిట్టాడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కాలిన గాయాలతో ఉన్న చిన్నారులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంతోషిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలకు సమయానికి నిద్ర లేవకపోవడంతో కూతుళ్లపై కోపంతో ఈ పనికి ఒడిగట్టిందని విచారణలో తెలిపింది. తదుపరి విచారణ నిమిత్తం తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.