గోషామహల్ సర్కిల్ చాక్నవాడి లో రోడ్డు కుంగి పోయిన ఘటనా స్థలాన్ని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పై ఏర్పాటుచేసిన అసెంబ్లీ కమిటీ అధ్యయన బృందం జిహెచ్ఎంసి అమలు చేస్తున్న పలు పథకాలపై చర్చించేందుకు తాజ్ కృష్ణలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆమె.. అనంతరం చాక్నవాడి బజారులో రోడ్డు కుంగిపోయిన స్థలాన్ని పరిశీలించారు.
మేయర్ ఘటనపై జోనల్ కమిషనర్ రవి కిరణ్, జోనల్ యస్ సి రత్నాకర్ ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. బి టి రోడ్డు క్రింది భాగాన 40 ఏళ్ల క్రితం నిర్మించిన నాలా పై భాగంలో వేసిన రోడ్డు అకస్మాత్తుగా కుంగడం వలన సంఘటన జరిగిందని అన్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణ, అస్తి నష్టం జరగలేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నాల నుండి నేరుగా నీరు వెళ్లేందుకు వెంటనే శిథిలాలను తొలగించే చర్యలు తక్షణమే చేపట్టడం జరుగుతుందన్నారు.