పెళ్లిచేసుకోను అన్న వధువు.. అవమానంగా బావించిన వరుడు.. పెళ్లికొచ్చిన అమ్మాయికే తాళి కట్టాడు
Marriage In Mahabubabad District. ఇటీవల కాలంలో పెళ్లి పీటల దాకా వచ్చి పెళ్లిళ్లు పెటాకులు అయిన ఘటనలు అనేకం చూశాం
By Medi Samrat Published on 25 Dec 2020 10:05 AM ISTఇటీవల కాలంలో పెళ్లి పీటల దాకా వచ్చి పెళ్లిళ్లు పెటాకులు అయిన ఘటనలు అనేకం చూశాం. వరుడి తాగి వచ్చాడని ఓ యువతి పెళ్లిని రద్దు చేసుకోగా.. ఓ పెళ్లికూతురు ఏకంగా తన ప్రియుడిని కళ్యాణ మండపానికి పిలిపించుకుని అందరి ముందే ముద్దు ఇచ్చిన సంఘటనలు చూశాం. తాజాగా ఓ అరగంటలో పెళ్లి తంతు పూర్తి అవుతుందనగా.. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి మరీ పెళ్లిని ఆపించేసింది ఓ వధువు. పీటలపై పెళ్లి ఆగిపోవడాన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు పెళ్లికొచ్చిన సమీప బంధువైన అమ్మాయితో అదే ముహూర్తానికి పెళ్లి జరిపించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మరిపెడలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడికి చెందిన యువకుడికి, కురవి మండలం కాంపెల్లికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బంధువులు అందరూ కళ్యాణ మండపానికి వచ్చేశారు. పెళ్లి తంతు మొదలైంది. మరో అరగంటలో వధువు మెడలో వరుడు మూడుమూళ్లు వేసేవాడు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు కళ్యాణ వేదిక వద్దకు రావడంతో అందరూ షాకైయ్యారు. తాను ఓ యువకుడిని ప్రేమించానని, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. వివాహాన్ని ఆపాలని మండపం పైనుంచే రహస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో అక్కడికి చేరుకున్న మరిపెడ సీఐ, ఎస్సైలు వధువును సమీపించి విషయం ఆరా తీశారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వధువు సరేమీరా అనడంతో వివాహాం నిలిచిపోయింది. చేసేది లేక కౌన్సెలింగ్ కోసం ఆ యువతిని సఖి కేంద్రానికి తరలించారు. తమ కుమార్తై పోలీసులకు ఫోన్ చేసిన విషయం తెలిసిన తల్లిదండ్రులు హతాశులయ్యారు. పెళ్లిపీటల మీద పెళ్లి ఆగి పోవడాన్ని అవమానంగా బావించిన వరుడి తల్లిదండ్రులు వివాహానికి హాజరైన సమీప బంధువుల అమ్మాయితో అదే మండపంలో అతడికి పెళ్లి చేయడం విశేషం.