'టీ కాంగ్రెస్‌లో కుమ్ములాటలకు ఆ ఇద్దరే కారణం'

Marri Shasidhar Reddy's sensational comments on the internal strife in the Congress. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి.. రేవంత్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. పార్టీని నడిపిస్తున్న వ్యక్తే కాంగ్రెస్‌లో కల్లోలానికి

By అంజి  Published on  17 Aug 2022 11:28 AM GMT
టీ కాంగ్రెస్‌లో కుమ్ములాటలకు ఆ ఇద్దరే కారణం

తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలాలు ఆగడం లేదు. ఆ మధ్య జగ్గారెడ్డి వర్సెస్‌ రేవంత్‌ రెడ్డి, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్‌ రేవంత్‌ మధ్య వార్‌ నడుస్తోంది. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెంకట్‌ రెడ్డి కూడా పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత అద్దంకి దయాకర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అద్దంకి చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. అయితే తాజాగా మరో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రేవంత్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి.. రేవంత్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. పార్టీని నడిపిస్తున్న వ్యక్తే కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణమవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇతనికి రాష్ట్ర ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ తోడయ్యాడని, మాణికం ఠాగూర్‌.. రేవంత్‌ ఏజెంట్‌గా మారిపోయాడని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ విషయంలో రేవంత్‌ రెడ్డి తీరు సరిగా లేదంటూ ఫైర్‌ చేశారు. సీనియర్లను గోడకేసి కొడతా అని అన్నప్పటికీ రేవంత్‌ను ఠాగూర్‌ ఎందుకు మందలించలేదని నిలదీశారు. ఓ వైపు నాయకులు పార్టీని వీడటం, మరోవైపు పార్టీలో అంతర్గత విబేధాలు.. తాజాగా మర్రి శశిధర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు, చర్చకు దారితీశాయి.

రేవంత్ రెడ్డి హోంగార్డు కామెంట్స్, చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్‌కు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. అయినా వెంకటరెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన రీతిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు మునుగోడు వైపు చూసేది లేదంటున్నారు. మాణికం ఠాగూర్ వ్యవహారశైలిపై పార్టీలో అసంతృప్తి ఉంది. సీనియర్ల అభిప్రాయాలు, సలహాలను పట్టించుకోకుండా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలంగా ఉంటున్నారని ఆయనపై కొందరు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story