తెలంగాణలో కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది
By - Knakam Karthik |
తెలంగాణలో కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోమవారం ఓ అధికారిక లేఖ విడుదలైంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.
గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కోసం వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు ఉద్యమించాయని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే తాము గత మే నెలలో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించామని జగన్ గుర్తుచేశారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో, ప్రజల అభీష్టం మేరకు మరో ఆరు నెలల పాటు ఈ విరమణను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గడిచిన ఆరు నెలల కాలంలో తమ వైపు నుంచి సంపూర్ణంగా శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులోనూ ఇదే పంథాను అనుసరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో వ్యవహరించిన విధంగానే సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో నెలకొన్న శాంతి వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని జగన్ తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దుందుడుకు చర్యలను అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, మేధావులు ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఓవైపు మావోయిస్టులు తెలంగాణలో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టులతో ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందం ఉండబోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే ఓ బహిరంగ సభలో తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.