ఓయూలో నిర్బంధ ఆంక్షలు, మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్బంధ ఆంక్షలు విధించారని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది

By Knakam Karthik
Published on : 31 March 2025 4:54 PM IST

Hyderabad News, Congress Governmenr, Osmania University, Maoist Party Letter

ఓయూలో నిర్బంధ ఆంక్షలు, మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్బంధ ఆంక్షలు విధించారని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది. నియంతృత్వ విధానాలను అమలు చేస్తూ కనీస పౌర స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపించింది.

ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేయకూడదని ఈ నెల 13న ఓయూ రిజస్ట్రార్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన వారినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించిందని, యూనివర్సిటీల్లో విద్యార్థుల పోరాటాలను అణిచివేయడానికి ఈ నిషేదాజ్ఞలు విధించారని ఆరోపించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల రాజ్యాంగ విరుద్ధం అని అప్రజాస్వామికం అని ధ్వజమెత్తింది. ఇలాంటి నిరంకుశత్వ చర్యలు దేశ భవిష్యత్తు ను నాశనం చేస్తాయని పేర్కొంది. విద్యను ప్రైవేట్ పరం చేసిన కార్పోరెట్లకు అప్పగించడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది.

ఓయూ యూనివర్సిటీ విద్యార్థులు నిజాం మొదలు నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని దేశ రాజకీయాల్లో తెలంగాణ సామాజిక, రాజకీయ ఆర్థిక పోరాటాలలో క్రియాశీలంగా పాల్గొన్నారు. విద్యార్థులు కేవలం సమస్యలకే పరిమితం కాలేదు ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి అనేక త్యాగాలు చేశారని లేఖలో ప్రస్తావించింది. నేడు చాలా మంది అనుభవిస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక ఫలాలన్నీ విద్యార్థులు చేసిన విరోచిత పోరాటాల ఫలితమేనని కానీ నేడు దోపిడీ పాలక వర్గాలు మాత్రం దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల ప్రయోజనాలను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తింది. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం విధించిన నిర్భంద ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ ఆంక్షలను ఎత్తివేసే వరకు విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ పిలిపునిచ్చింది.

Next Story