మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి
Maoist leader Haribhushan dies of corona virus.మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్
By తోట వంశీ కుమార్
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో మరణించారు. ఈ విషయాన్ని కొత్తగూడెం జిల్లా ఎస్పీ దత్ ధృవీకరించారు. హరిభూషణ్ ఆరోగ్య పరిస్థితిపై మంగవారం సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. దీంతో కొత్తగూడెం జిల్లా పోలీసులు అతడి గురించిన సమాచారం సేకరించారు. గత కొంత కాలంగా కరోనాతో బాధపడుతున్న హరిభూషణ్ గుండెపోటుతో మృతి చెందాడని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. హరిభూషణ్ భార్య శారదతో సహా మరికొంతమంది అగ్రనాయకులు కరోన సోకి బాధపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) వుప్పు తిరుపతి పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
హరిభూషణ్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తగూడెం మండలం మరగూడ. 1995లో ఆయన మావోయిస్టు పార్టీలో చేరారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న హరిభూషణ్ పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. గతంలో పువ్వర్తి, తడపలగుట్ట ఎదురు కాల్పుల్లో హరిభూషణ్ మృతి చెందినట్లు ప్రచారం జరిగినప్పటికీ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.