దళిత బంధువు కాదు.. దళిత శత్రువు : కాంగ్రెస్ నేత‌

Mallu Ravi Fires On CM KCR. దళిత బంధు అంటూ కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నాడని..

By Medi Samrat  Published on  7 Sept 2021 9:25 AM IST
దళిత బంధువు కాదు.. దళిత శత్రువు : కాంగ్రెస్ నేత‌

దళిత బంధు అంటూ కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నాడని.. కేసీఆర్ దళిత బంధు కాదు దళితుల శత్రువు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఇందిరాపార్క్ వద్ద హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సత్యాగ్రహ దీక్షలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ వచ్చాక మొదటి సంతకం అంబేద్క‌ర్ ప్రాణహిత పేరు మార్చేందుకు పెట్టాడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ మీద తొలి సంతకం పెడితే.. కేసీఆర్ అంబేద్క‌ర్ పేరు తొలగించేందుకు పెట్టారని అన్నారు. అలాగే పంజాగుట్ట వద్ద అంబేద్క‌ర్ విగ్రహాన్ని కూల్చి వేసి చెత్తలో వేశారని ఇంతవరకు అక్కడ మళ్ళీ కొత్త అంబేద్క‌ర్ విగ్రహం ఏర్పాటు చేయలేదని అన్నారు.

ఎన్నికలలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని మోసం చేసారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని మనకు చట్ట ప్రకారం రావాల్సిన రూ.65 వేల కోట్ల నిధులు ఖర్చు చేయకుండా నష్టం చేసారని ఇప్పుడు ఎన్నికల ముందు దళిత బంధు అంటూ మళ్ళీ మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు. దళితులను ఏడేళ్లుగా మోసం చేస్తూ నష్టం చేస్తూ మాయమాటలు చెప్పి లబ్ది పొందుతున్న కేసీఆర్ దళితులకు ఎలా బరువు అవుతారని ఆయన దళిత శత్రువని ఈ విషయాన్ని దళితులందరు అర్థం చేసుకొని కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.


Next Story