క్యాన్సర్ వ‌చ్చిన‌ తల్లిని నడి బజారులో వదిలిపెట్టిన కొడుకులా మిగిలిపోతారు

Malli Ravi Comments On Marri Shashidhar Reddy. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

By Medi Samrat  Published on  23 Nov 2022 5:02 PM IST
క్యాన్సర్ వ‌చ్చిన‌ తల్లిని నడి బజారులో వదిలిపెట్టిన కొడుకులా మిగిలిపోతారు

మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌య‌మై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లు ర‌వి పైర్ అయ్యారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతానని శ‌శిధ‌ర్ రెడ్డి ప్రకటించినప్పుడు.. తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రజల కోసం చేరుతున్నానని చెప్పారు. ఏ రకంగా తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు బీజేపీ ఉపయోగపడుతుందో మర్రి శశిధర్ రెడ్డి చెప్పాలని సీనియ‌ర్ నేత మ‌ల్లు ర‌వి డిమాండ్ చేశారు.


8 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదో చెప్పాలని అన్నారు. తెలంగాణలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐఐఎం, ఐటీఐఆర్ ఇవన్నీ రాలేదని మీకు తెలియదా.. అని శ‌శిధ‌ర్ రెడ్డిని ప్ర‌శ్నించారు. మీరిప్పుడు బీజేపీలో చేరడం వల్ల ఈ ఎనిమిది ఏళ్లలో జరగనిది.. ఇప్పుడు జరుగుతుందా.? అని అడిగారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ కోసం, తెలంగాణ సకల జనుల కోసం ఇచ్చిన సంగతి మీకు తెలియదా అని నిల‌దీశారు. మీకు రాజకీయ జన్మ ను ఇచ్చిన తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని క్యాన్సర్ వచ్చిందని చెబుతూ విడటం అత్యంత దారుణమైన విషయమ‌ని.. ఏ కొడుకు తల్లికి చేయనంత ద్రోహం మీరు చేశారని.. క్యాన్సర్ వ‌చ్చిన‌ తల్లిని నడి బజారులో వదిలిపెట్టిన కొడుకులా.. ప్రజల ముందు నిలబడ్డారని శ‌శిధ‌ర్ రెడ్డిని విమ‌ర్శించారు.

పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు అయితే.. మీరు ఢిల్లీకి వెళ్ళినపుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసుకునేవారు. కానీ ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను డీకే అరుణ, బండి సంజయ్ తో కలిసి బేరం కుదుర్చుకున్నారని విమ‌ర్శించారు. అమిత్ షాను క‌లిశాక‌ రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్, కేసీ వేణుగోపాల్ పైన అసత్య ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాలని చూశార‌ని శ‌శిధ‌ర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. శ‌శిధ‌ర్ రెడ్డి బీజేపీలోకి పోవడానికే కాంగ్రెస్ పైన బురద చల్లుతున్నారనే విష‌యం అర్ధ‌మ‌వుతుంద‌ని అన్నారు.


Next Story