ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు
By Medi Samrat Published on 8 Jun 2024 7:18 AM ISTవరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. మూడు రోజులపాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. రెండోరోజు గురువారం రాత్రి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికీ గెలుపుకు కావాల్సిన 1,55,095 ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోల్ కాగా, అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికిపైగా అంటే 1,55,095 ఓట్లు గెలుపునకు టార్గెట్ కోటా కాగా.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులందరికి కలిపి 10,118 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇక రెండో ప్రాధాన్యత ఓట్లను గురువారం సాయంత్రం నుంచి లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను కలుపుతూ లెక్కించారు. 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు, రాకేష్‌రెడ్డికి 1,0,5,524 ఓట్లు , ప్రేమేందర్‌రెడ్డికి 43,096 ఓట్లకు చేరుకున్నారు. అయినా గెలుపు కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో నాలుగోస్థానంలో ఉన్న స్వతంత్ర పాలకూరి అశోక్‌ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారో లెక్కించారు. అప్పటికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాలేదు. మూడోస్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయన ఓట్లు లెక్కించారు. అయినా కూడా గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. టార్గెట్ కోటా ఓట్లు ఎవరికీ రాకపోవడం, మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించాలా లేదా అని ఎన్నికల సంఘానికి రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన లేఖ రాశారు. అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని ఈసీ నుంచి సమాచారం అందింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారు. విజయం తీన్మార్ మల్లన్నకు వరించినా.. నైతిక విజయం మాత్రం తనదేనని ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు.