Jubilee Hills Bypoll : 300 మందితో నామినేషన్లు.. మాల జేఏసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఎస్సీ వర్గీకరణ విధానంపై మాల జాయింట్ యాక్షన్ కమిటీ నిరసనలకు సిద్ధమైంది.

By -  Medi Samrat
Published on : 13 Oct 2025 8:43 PM IST

Jubilee Hills Bypoll : 300 మందితో నామినేషన్లు.. మాల జేఏసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఎస్సీ వర్గీకరణ విధానంపై మాల జాయింట్ యాక్షన్ కమిటీ నిరసనలకు సిద్ధమైంది. ఈ విధానం వల్ల తమ సామాజికవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఏకంగా 300 మందితో నామినేషన్లు వేయించనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడారు. గత ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎస్సీ వర్గీకరణ విధానం వల్ల గ్రూప్-3లోని 25 మాల కులాలకు విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అధ్యక్షులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని నాయకులు డిమాండ్ చేశారు.

మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ శాతం పెంచడంతో పాటు, మొదటి 20 రోస్టర్ పాయింట్లలో రెండు కేటాయించాలని జేఏసీ నాయకులు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నాంది పలకాలని ఆయన మాల సమాజానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమికి కంకణం కట్టుకుంటామని హెచ్చరించారు.

Next Story