రేపు ఖమ్మం లో జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు హాజమయ్యేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కొద్దిసేపటి క్రిత హైద్రాబాద్‌కు చేరుకున్నారు. వీరికి తెలంగాణ మంత్రి మొహమద్ అలీ బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు.
అతిథులు బుధవారం ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అనంతరం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి 2 హెలికాప్టర్లలో బయలుదేరి యాదాద్రికి చేరుకుంటారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుని ఖమ్మం బయలుదేరతారు.
ఇదిలావుంటే.. ఖమ్మం వేదికగా రేపు జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ వెనక భాగంలోని 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతో సహా మహబూబాబాద్, సూర్యాపేట, ఇతర నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు నేతలు.