టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి.. బీజేపీ నుంచి పోటీ..
Mahesh Kumar Goud Fires On Etela Rajendar. హుజురాబాద్ లో టీఆర్ఎస్, బిజెపి లు డబ్బులను విచ్చల విడిగా పంచుతున్నారని పీసీసీ
By Medi Samrat Published on 22 Oct 2021 6:08 PM ISTహుజురాబాద్ లో టీఆర్ఎస్, బిజెపి లు డబ్బులను విచ్చల విడిగా పంచుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు.. భవిష్యత్తులో చూడమని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఈటెల.. ఇప్పుడు బిజెపి నుంచి పోటీ చేస్తున్నాడని విమర్శించారు. ఈటెల అవినీతిలో టీఆర్ఎస్ కు భాగస్వామ్యం ఉందని.. అలాంటి అవినీతి పరుడు ఇప్పుడు బిజెపి నుంచి పోటీ చేస్తున్నాడని అన్నారు.
టీఆర్ఎస్, బిజెపి లకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు. పెట్రోల్, ధరలు డీజిల్ ధరలు రోజు పెంచుతున్నందుకు బిజెపికి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. దేశంలో బిజెపి సర్కార్, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని.. మోదీ దేశాన్ని కార్పొరేట్ల చేతిలో పెడుతున్నారని.. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి విద్యార్థి, నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ అని.. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. అవినీతి పరులను కాకుండా.. ప్రజల పక్షాన పోరాడే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని హుజురాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఎన్నికల ప్రచారం లో పాల్గొంటారని.. మా పార్టీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ అందరు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారని తెలిపారు.