రాష్ట్రానికి సీఎం వా..? లేక వాసాలమర్రి సర్పంచ్ వా..? అంటూ సీఎం కేసీఆర్‌పై మధుయాష్కీ ఫైర్

Madhu Yaski Fires On CM KCR. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. శ‌నివారం గాంధీ భవన్ లో

By Medi Samrat  Published on  7 Aug 2021 2:33 PM IST
రాష్ట్రానికి సీఎం వా..? లేక వాసాలమర్రి సర్పంచ్ వా..? అంటూ సీఎం కేసీఆర్‌పై మధుయాష్కీ ఫైర్

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. శ‌నివారం గాంధీ భవన్ లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న‌.. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా..? లేక వాసాలమర్రి సర్పంచ్ వా..? అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, విద్యా, ఉద్యోగాలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని.. కానీ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బంది అయ్యిందని మండిప‌డ్డారు.


కేసీఆర్ నయా నిజాం లాగా పాలన సాగిస్తున్నాడని.. కేసీఆర్ అరాచక.. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం రోజు ఆగస్ట్ 9న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. కేసీఆర్ ఎన్నికల్లో దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చి ఉంటే దళిత, గిరిజనులు ఆత్మగౌరవంతో ఉండేవారని అన్నారు. మూడెకరాల భూమి ఇవ్వలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. ఇప్పుడు ఎన్నికల కోసం దళిత బందు పేరుతో కొత్త నాటకం ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు.

ఉద్యోగాలు ఇచ్చి ఉంటే.. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలు ఆర్థికంగా ఆత్మగౌరవంతో బ్రతికేవారని.. ఉద్యోగ కల్పన జరిగి ఉంటే.. నీవు ఇచ్చే బోడి పది లక్షలు వాళ్లకు ఏం అవసరం అని ప్ర‌శ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీల రాష్ట్ర సంపదతో కేసీఆర్ విలాస వంతమైన ప్రగతి భవన్ కట్టుకున్నాడని.. రాజ్యాంగం ప్రకారం వారికి వచ్చే హక్కులు అమలు అయితే.. వారు ఆత్మగౌరవంతో ఉండేవారని అన్నారు. దళిత, గిరిజనుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చినా తక్కువేన‌ని.. హుజురాబాద్ ఎన్నికల కోసం కేసీఆర్ మళ్ళీ మోసాలకు తెర లేపారని విమ‌ర్శించారు. ఇంద్రవెల్లి సభకు రాజకీయాలకు అతీతంగా అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.


Next Story