వెళ్లాలనుకుంటే వెళ్ళండి.. వెన్నుపోటు పొడవద్దు : మధుయాష్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Madhu Yashki Sansational Comments On Komatireddy Venkatreddy. విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదు.. రాజకీయ సమ్మేళనమ‌ని

By Medi Samrat  Published on  4 Sept 2021 7:02 PM IST
వెళ్లాలనుకుంటే వెళ్ళండి.. వెన్నుపోటు పొడవద్దు : మధుయాష్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదు.. రాజకీయ సమ్మేళనమ‌ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. వైఎస్ సేవలు కాంగ్రెస్ గుర్తించిందని.. జగన్.. షర్మిలలు ఎదిగిన కాంగ్రెస్ కొమ్మని నరకాలని చూస్తున్నారని విమ‌ర్శించారు. వైఎస్ జీవిత లక్ష్యం.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడ‌మ‌ని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదుగుదల.. నా ఎదుగుదల అయినా.. సోనియా గాంధీ వల్లనే అవుతుంద‌ని.. పార్టీ నిర్ణయం కాదని వెళ్తే.. అది పార్టీని నష్టపరచడమే అని వ్యాఖ్యానించారు.

తండ్రి ఆత్మీయ సమ్మేళనంకి రాని కొడుకు ఉంటాడా..? అని ప్ర‌శ్నించారు. విజయమ్మ.. వైఎస్ బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని అంటున్నారని.. దాన్ని కోమటిరెడ్డి సమర్ధిస్తారా అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్ళండని.. కానీ వెన్నుపోటు పొడవద్దు అని కోమటిరెడ్డిని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ బిడ్డలు.. వైఎస్ ని వ్యతిరేకించారని అన్నారు.

అన్నా చెల్లెళ్ల ఆత్మీయత తెలియని వ్యక్తులు.. సీతక్క, చంద్రబాబుకు రాఖీ కట్టడాన్ని కూడా రాజకీయం చేయడం జ్ఞానం లేని వారు చేసే పని అన్నారు. కాంగ్రెస్ లో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు.. పోవాలని అనుకుంటే పోవచ్చని.. కాంగ్రెస్ ను వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్ళి మాట్లాడటం పార్టీకి నష్టమే న‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ విష‌య‌మై చర్యలు తీసుకోవాలా.. వద్దా అనేది అధిష్టానం చూసుకుంటుందని.. అయినా 12 ఏళ్ల‌ తర్వాత వైఎస్ గుర్తుకు వచ్చారా.. అని ప్ర‌శ్నించారు. మోదీ.. అమిత్ షా చేతిలో ఉండి పని చేస్తే వైఎస్ ఆత్మ క్షోబిస్తుందని వ్యాఖ్యానించారు.

కేసిఆర్, మోదీ భేటీ.. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఉందని అన్నారు. గతంలో నిజాం నవాబు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు వంగినట్టు కేసీఆర్, మోడీ ఫోటో ఉందని అన్నారు. కేసుల నుండి బయట పడేందుకు కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారని.. కృష్ణా జలాల మీద ఎందుకు మాట్లాడలేదని ప్ర‌శ్నించారు. మోదీకి ఇచ్చిన వినతులు.. విభజన చట్టంలోనే ఉన్నాయని.. ఏడేళ్లు ఎందుకు మర్చిపోయార‌ని అన్నారు. ఢిల్లీకి గులాంలు అని ఇతర పార్టీ నాయకులను హరీష్ రావు అంటారని.. మరి కేసీఆర్ కి ఢిల్లీ లో భవనం ఎందుకు అని ప్ర‌శ్నించారు.


Next Story