రేవంత్ టికెట్ కూడా ఏఐసీసీ నే ప్రకటిస్తుంది.. జగ్గారెడ్డి వ్యాఖ్య‌లు.. ఆయన వ్య‌క్తిగ‌తం

Madhu Yashki Goud Fires On CM KCR. రాష్ట్రంలో నిరుద్యోగ యువత బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రమే

By Medi Samrat  Published on  1 Nov 2021 4:55 PM IST
రేవంత్ టికెట్ కూడా ఏఐసీసీ నే ప్రకటిస్తుంది.. జగ్గారెడ్డి వ్యాఖ్య‌లు.. ఆయన వ్య‌క్తిగ‌తం

రాష్ట్రంలో నిరుద్యోగ యువత బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్దిపొందుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో నిన్న మహేష్ అనే నీరుద్యోగి ఆత్మహత్యకి ముఖ్యమంత్రే కారణమ‌ని.. కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అన్నారు. తెలంగాణలో ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. ప్రగతి భవన్ ను ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నేతల అరెస్ట్ లను ఖండిస్తున్నామ‌ని తెలిపారు.

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు నేడు డిజిటల్ మెంబెర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డిజిటల్ మెంబెర్ షిప్ పైన డీసీసీ, మండల, టౌన్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులకు న‌వంబ‌ర్‌ 8, 9 ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంద‌ని.. యువత పేద సంఖ్యలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న చలో హైదరాబాద్ నినాదంతో లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ చేపడ్తామ‌ని.. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు.

పెట్రోల్, డీజిల్, పప్పు దినుసుల రేట్లు పెరగడంతో సామాన్యుడికీ భారంగా మారాయని అన్నారు. మతం పేరుతో సమాజాన్ని విడదీసి పాలిస్తున్న బీజేపీ.. అందుకు మద్దతు పలుకుతున్న టిఆర్ఎస్ పార్టీలకు చరమగీతం చెప్తేనే ఆగమైన నిరుద్యోగ బతుకులు బాగుపడుతాయని.. దేశం సుభిక్షంగా ఉంటుందని మధు యాష్కీ అన్నారు. రాష్ట్ర, దేశ స్థాయిలో ఉన్న సమస్యలపై నవంబర్ 14 నుండి 21 వరకు ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పార్టీ అగ్రనాయకులు ప్రజా చైతన్య యాత్ర చేపడతారని తెలిపారు.

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌ జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు.. ఆయన సొంత మాటలని స్ప‌ష్టం చేశారు. మళ్ళీ సమైక్య రాష్ట్రంపై ఎవరైనా మాట్లాడిన అది వారి సొంత నిర్ణయాలేన‌ని తెలిపారు. కేసీఆర్ ను ప్రజా కోర్టులో శిక్షించాలని.. యాదగిరి గుట్ట పనులు కూడా ఆంధ్ర వాళ్లే చేస్తున్నారని ఆరోపించారు. దొరల పాలనలో చాలా మంది యువకులు నక్సలిజం వైపు వెళ్లారని.. సమైక్య రాష్ట్రంలో అస్తవ్యస్థమైన‌ పాలన అంతం కావాలని.. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఏర్పడాలని సోనియా గాంధీ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఇచ్చార‌ని అన్నారు.

రేవంత్ మాట్లాడిన మాట‌ల‌ను తప్పుగా ప్రచారం చేసుకుంటున్నారని.. మీడియా లో వస్తున్నవి తప్పుడు కథ‌నాలని అన్నారు. కష్టించి పని చేస్తున్న నాయకులకు గుర్తింపు ఉంటుంద‌ని తెలిపారు. పని చేసిన కార్యకర్తలకు పదవులిస్తామ‌ని అన్నారు. ధరణి పోర్టల్ ద్వారా.. దొరల చేతుల్లోకి వేల ఎకరాలు వెళ్ళాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి టికెట్ కూడా ఏఐసీసీ ప్రకటిస్తుందని అన్నారు. బీసీ వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తోంద‌ని.. ఏ, బీ, సీ లకు వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లు కేటాయిస్తామ‌ని తెలిపారు.


Next Story