వరి ఆఖరి గింజ కూడా కొంటామని చెప్పి..

Madhu Yashki Goud Fires On CM KCR. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని చెప్పడం సమంజసం కాదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్

By Medi Samrat  Published on  14 Sep 2021 9:54 AM GMT
వరి ఆఖరి గింజ కూడా కొంటామని చెప్పి..

వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని చెప్పడం సమంజసం కాదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. మంగ‌ళ‌వారం గాంధీభ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. గతంలో సన్నాలు వేయాలంటూ రైతులను మోసం చేశారు.. మొక్కజొన్న వద్దంటారు.. వ్య‌వ‌సాయ‌మే జీవ‌నాధారంగా ఉన్న‌ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాలసీ చెప్పకుండా.. రైతులను వెన్నుపోటు పొడిచారని మండిప‌డ్డారు. రైతు ఆత్మహత్యలతో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని.. రైతుల ఆత్మహత్యలకు కారణం.. సీఎం కేసీఆర్ విధానాలేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఉచితంగా ఎరువులు, రుణమాఫీ అని చెప్పి.. ఢిల్లీ వెళ్లి మాట మార్చారని.. వరి ఆఖరి గింజ కూడా కొంటామని చెప్పి.. ఇప్పుడు వేయవద్దంటున్నారని అన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి.. నరేంద్రమోదీ, కేసీఆర్ కలిసి ఆడుతున్న డ్రామా సామాన్య రైతుల పొట్టకొట్టి.. బడా పారిశ్రామిక వేత్తలకు దోచిపెడుతున్నారని విమ‌ర్శించారు. ఇన్ పుట్ సబ్సిడీ లేదని.. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం కమీషన్ల కోసమేన‌ని.. రైతుల మెడలో ఉరితాడు వేస్తున్నది కేసీఆర్ అని మండిప‌డ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలు.. రైతుల నడ్డి విరవ‌డం కోసమేన‌ని.. మోదీ, కేసీఆర్ లు కలిసి రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రైతాంగం ప‌క్షాన పోరాడుతుంద‌ని తెలిపారు. ఆకాల వర్షం తో నష్టపోయిన రైతుల‌కు ఇన్ పుట్ సబ్సిడీ అందజేయాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు.


Next Story