వరంగల్ రైతు డిక్లరేషన్ ను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని రాహుల్ గాంధీ కోరారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల అధ్యక్షులు ప్రెస్ మీట్ లు పెట్టి రైతు డిక్లరేషన్ ప్రచారం చేయాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని రైతు డిక్లరేషన్ ను నెల రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. రాహుల్ గాంధీ వరంగల్ సభ చూసి టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతుందని.. విగ్గుగాళ్ళు, పెగ్గుగాళ్ళకు రాహుల్ గాంధీ గూర్చి మాట్లాడే స్థాయి లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని మండిపడ్డారు. కేసీఆర్ అంటేనే మోసం, దఘా అని విమర్శించారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని.. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే టీఆర్ఎస్ నేతలు మొహంజ మార్కెట్ లో గులాబీ పూలు అమ్ముకుంటూ బతికేవారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని మధుయాష్కీ గౌడ్ అన్నారు.