తెలంగాణలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. దేశ వ్యాప్తంగా మధ్యాహ్నం 2:39 గంటలకు గ్రహణం ప్రారంభం కాగా.. తెలంగాణలో సాయంత్రం 5:40 గంటలకు ప్రారంభమైంది. ఈ గ్రహణం సాయంత్రం 6:19 గంటల వరకు కొనసాగింది. మొత్తంగా తెలంగాణలో 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించినట్లుగా చెబుతున్నారు. ప్రజలు పాక్షిక చంద్రగ్రహణాన్ని వీక్షించడంతో పాటు తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేశారు. అసోంలోని గుహవాటిలో అత్యధికంగా ఒక గంట 43 నిమిషాల పాటు కనిపించింది.
గ్రహణం ముగియడంతో ప్రజలు గ్రహణం విడుపు స్నానాలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి సంపూర్ణ చంద్రగ్రహణం. మళ్లీ 2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని చెబుతున్నారు. చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని యాదాద్రి ఆలయం, భద్రాద్రి, వేములవాడ, జోగులాంబ, కాళేశ్వరం, వరంగల్ భద్రకాళి ఆలయంతో పాటు పలు ఆలయాలను కూడా మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత శుద్ధి అనంతరం తిరిగి ఆలయాలు తెరుచుకోనున్నాయి.