కాంగ్రెస్ థర్డ్ లిస్ట్.. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ముగ్గురికి సీటు
2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ గురువారం ప్రకటించిన మూడో జాబితాలో తెలంగాణ నుండి ఐదుగురు లోక్‌సభ అభ్యర్థుల పేర్లు వెలువడ్డాయి.
By అంజి Published on 22 March 2024 6:46 AM ISTకాంగ్రెస్ థర్డ్ లిస్ట్.. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ముగ్గురికి సీటు
హైదరాబాద్: 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ గురువారం ప్రకటించిన మూడో జాబితాలో తెలంగాణ నుండి ఐదుగురు లోక్‌సభ అభ్యర్థుల పేర్లు వెలువడ్డాయి. ఈ జాబితాలోని ఐదుగురిలో ముగ్గురు ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరి సీటు చోటు దక్కించుకున్నారు. ఈరోజు ఐదుగురు అభ్యర్థులను ప్రకటించడంతో, రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్ తరఫున అభ్యర్థుల సంఖ్య తొమ్మిదికి చేరింది. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్ (ఎస్‌సీ), పెద్దపల్లె (ఎస్సీ) నుంచి దానం నాగేందర్, జీ రంజిత్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి, మల్లు రవి, జీ వంశీకృష్ణలను కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించింది.
దానం నాగేందర్ ఇటీవలే కాంగ్రెస్‌లోకి మారిన సిట్టింగ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాగా, రంజిత్ రెడ్డి అవుట్‌గోయింగ్ లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్నారు. సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ నాయకురాలు. మల్లు రవి రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాగా, వంశీకృష్ణ యువకుడు.
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మెజారిటీ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు గాను 14 స్థానాలు కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయంగా పెట్టుకున్నట్లు గతంలో ప్రకటించారు. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరి లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రం నుంచి మూడు స్థానాలను గెలుచుకుంది.