బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు మేరకు.. లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్‌రెడ్డితో పాటు మరో నలుగురు పోలీసు అధికారులకు.. అధికార ఉల్లంఘనకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. వీరంతా ఫిబ్రవరి 3న ప్యానెల్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కరీంనగర్ సీపీ వీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాసరావు, జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, కరీంనగర్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీబాబులకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఎలాంటి కారణం లేకుండా కరీంనగర్ పోలీస్ కమిషనర్ బండి సంజయ్‌పై దాడి చేయడంపై ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. శుక్రవారం బండి సంజయ్ లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చి కరీంనగర్ లో తనపై జరిగిన దాడిని వివరించారు.
పార్లమెంటు సభ్యుడిగా తన హక్కులను పోలీసులు ఉల్లంఘించారని, క్యాంపు కార్యాలయంలో 'జాగరణ్' సందర్భంగా తలుపులు పగులగొట్టి, గ్యాస్ కట్టర్లతో తలుపులు పగులగొట్టారని సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ప్యానెల్‌ను బండి సంజయ్ కోరారు. ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా జనవరి 2న తన మద్దతుదారులతో కలిసి బండి సంజయ్ 'జాగరణ్' కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరుసటి రోజు.. సంజయ్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనను రిమాండ్ కు పంపింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఎంపీ రిమాండ్‌ను కొట్టివేస్తూ విడుదలకు ఆదేశించింది.