తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ నేటితో(మే 30)తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం మధ్యాహ్నాం 2 గంటలకు భేటీ అయిన కేబినేట్ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా లాక్‌డౌన్ పొడిగింపు విషయాన్ని తెలియజేశారు.
మరో 10 రోజులు తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగించాలని కేబినెట్ సమావేశం తీర్మానించింది. రోజువారీ సడలింపును ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించడం జరిగింది. ఆర్థిక కార్యకలాపాల పరిమిత పునరుద్ధరణకు ఈ నిర్ణయం తీసుకోబడింది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయబడతాయని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే.. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతించిన ప్రభుత్వం... కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, ప్రజల కార్యకలాపాలకు మరికొన్ని గంటలు అదనపు సమయం ఇవ్వాలని నిర్ణయించింది.