మందు బాబులకు బ్యాడ్ న్యూస్..ఆ మూడ్రోజులు అక్కడ వైన్స్ బంద్
తెలంగాణలో మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 24 Feb 2025 4:43 PM IST
మందు బాబులకు బ్యాడ్ న్యూస్..ఆ మూడ్రోజులు అక్కడ వైన్స్ బంద్
తెలంగాణలో మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలో ఏకంగా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే కారణం. రాష్ట్రంలోని ఏడు ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఆయా ప్రాంతాల్లో అభ్యర్ధులు ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే తేదీతో పాటు మరో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని సర్కార్ నిర్ణయించింది.
ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడు ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం షాపులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.