హైదరాబాద్: గణేశ్ నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గణేశ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సందర్భంగా సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 7న ఉదయం 6 గంటల వరకు రెస్టారెంట్లలోని బార్‌లు (స్టార్ హోటళ్లలోని బార్‌లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు మినహా) సహా అన్ని కల్లు, వైన్ దుకాణాలు మూసివేయబడతాయి.
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం, 1974లోని సెక్షన్ 20 కింద సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఈ ఆదేశాన్ని జారీ చేశారు. అటు హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉండనున్నాయి.
ఈ మేరకు హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాచకొండ పరిధిలోని భువనగిరి జోన్‌లో మాత్రం మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తించదు. నిబంధనలు అతిక్రమించి మద్యం దుకాణాలను తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అటు రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో కూడా వైన్స్ బంద్ ఉండనున్నాయి. ఇప్పటికే కలెక్టర్లు ఆయా డిపార్ట్‌మెంట్లకు ఆదేశాలు ఇచ్చారు.