శ్రీరామనవమి సందర్భంగా నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని మద్యం దుకాణాలు మూతబడనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కూడా బంద్ చేయాలని ఆదేశించారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర ఉండడంతో శాంతిభద్రతలు పరిరక్షించడంలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఊరూరా..వాడవాడలా సీతారాముల కల్యాణోత్సవాలను సంబరంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపధ్యంలో రామాలయాలను శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబు చేశారు. అటు భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.