సీపీఎం తెలంగాణ కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. సంగారెడ్డి వేదికగా నాలుగు రోజులపాటు జరిగిన రాష్ట్ర మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు రోజున పార్టీ స్టేట్ సెక్రటరీగా జాన్ వెస్లీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలిసారిగా దళిత నేతకు అవకాశం దక్కిందని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గంలో 60 మందిని సభ్యులుగా తీసుకున్నారు. పార్టీ నియమావళిని అనుసరించి 70 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని కమిటీని నుంచి తప్పించారు. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావు రిలీవ్ అయ్యారు. వారు పార్టీకి తమ సేవలను కొనసాగించనున్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన జాన్ వెస్లీకి ఫోన్ చేసి అభినందనలు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. జాన్ వెస్లీ దశాబ్దాల కాలం పాటు సిద్ధాంతాల కోసం పోరాడుతూ.. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం హర్షనీయమని మహేష్ కుమార్ అన్నారు. దేశంలో, రాష్ట్రంలో మతతత్వ శక్తులు, అవినీతి పరులు, నియంతలను ఓడించేందుకు లౌకిక భావ సిద్ధాంతాలతో కలిసి పని చేద్దామని జాన్ వెస్లీని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.