L&T నిష్క్రమించినా.. మహాలక్ష్మీ పథకం ఆగదు: సీఎం రేవంత్
మహాలక్ష్మీ పథకం వల్ల నష్టం జరుగుతోందని మెట్రో ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని ఎల్ అండ్ టీ సంస్థ చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 15 May 2024 8:45 AM GMTL&T నిష్క్రమించినా.. మహాలక్ష్మీ పథకం ఆగదు: సీఎం రేవంత్
మహాలక్ష్మి ఉచిత బస్ రైడ్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంతో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ (లార్సన్ అండ్ టర్బో) ఇండియా వైదొలగాలని భావిస్తే, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహాలక్ష్మీ పథకం వల్ల నష్టం జరుగుతోందని మెట్రో ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని ఎల్ అండ్ టీ సంస్థ చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తన నివాసంలో మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఎల్ అండ్ టీ వెళ్లిపోతే.. మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహించే కపెంనీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేస్తుందని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోన్న మహాలక్ష్మీని మాత్రం నిలిపే ప్రస్తకి లేదని స్పష్టం చేశారు. మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ మెట్రో రైల్ నష్టంతో ఆగదని స్పష్టం చేశారు.
''ఎల్‌అండ్ టి నష్టాలు లేదా లాభాల గురించి మేము బాధపడటం లేదు. వాళ్ళని వెల్లనిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఎంపికలను అన్వేషిస్తుంది. ఒక కాంట్రాక్టర్ పోతే మరో కాంట్రాక్టర్ వస్తాడు. ఇది పెద్ద విషయం కాదు'' అని రేవంత్ విలేకరులతో అన్నారు. ఇటీవల మహాలక్ష్మి పథకంపై ఎల్అండ్ టీ ప్రెసిడెంట్, డైరెక్టర్, సీఎఫ్ఓ శంకర్ రామన్ మాట్లాడారు. ఈ పథకం కొనసాగితే 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో నుండి వైదొలుగుతామని తెలిపారు. మహిళా ప్రయాణికులు కొత్త ఉచిత బస్ రైడ్ స్కీమ్‌ను ఇష్టపడతారని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు పెరిగినా, మొత్తం బస్సుల సంఖ్య పెరగలేదు. ఏమీ చెల్లించని మహిళలు దీనిని ఉపయోగిస్తున్నారని అన్నారు. రామన్ ప్రకటనపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వాలు కార్పొరేట్ల ఇష్టాయిష్టాలు, కల్పనలకు అనుగుణంగా పనిచేయవని అన్నారు.