రెడ్ అలెర్ట్.. చిరుత సంచారం కలకలం.. అక్కడికి వెళ్ళకండి..!
Leopard Appear in Mulugu District. ఈ మద్య తెలంగాణలో చిరుతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. కరోనా నేపథ్యంలో
By Medi Samrat
ఈ మద్య తెలంగాణలో చిరుతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. కరోనా నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు చోట్ల చిరుతలు మనుషులపై, సాదు జంతువులపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ములుగు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వాజేడు మండలంలో తాజాగా ఓ లేగ దూడపై దాడి చేసి చంపేసింది. దీంతో కొంగాల అటవీ ప్రాంత పరిసర గ్రామస్థులు భయాందోళనలకు గురౌతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత సంచారంతో అప్రమత్తమయ్యారు. మరోపక్క.. ఐలాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులను గుర్తించారు.
పదిహేను రోజుల క్రితం తొలిసారిగా ఈ ప్రాంతంలో చిరుత సంచారం.. వెలుగులోకి వచ్చింది. వాజేడు మండలం.. కొంగాల అటవీ ప్రాంతంలో.. చిటారు కొమ్మనెక్కిన చిరుత.. గ్రామస్తుల కంట బడింది. వారంతా కేకలు వేయడం.. పెద్దగా శబ్దాలు చేయడంతో.. అది సమీప అటవీ ప్రాంతంలోకి పరిగెత్తింది. చిరుత సంచారం, జంతువులను వేటాడడంతో.. అటవీ అధికారులు అప్రమత్తమైయ్యారు. కొంగాల, దూలాపురం గ్రామాల్లో జిల్లా అధికారులు పరిశీలన జరిపారు.
వేసవి కాలం కావడం.. సమీపంలోని జలపాతాల్లో దాహం తీర్చుకోవడానికి, జంతువులను వేటాడేందుకు చిరుత ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మరోపక్క.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో పులి సంచారం కలకలం రేపింది. ఐలాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులు కనపడ్డాయి. వెంటనే సంబంధిత బీట్ అధికారి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అటవీ ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు చేయాలని వారు ఆదేశించారు.