లాస్య పీఏ-డ్రైవర్ ఆకాష్ చెబుతోందిదే.!
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో ఆమె పీఏ-డ్రైవర్ ఆకాష్‌పై కేసు నమోదైంది.
By Medi Samrat Published on 24 Feb 2024 8:55 AM GMTకంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసులో ఆమె పీఏ-డ్రైవర్ ఆకాష్‌పై కేసు నమోదైంది. ఆకాష్ నిర్లక్ష్యపూరితంగా వాహనం నడపడం వల్లే లాస్య చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆకాష్ నుంచి పటాన్‌చెరు పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. మేజిస్ట్రేట్ సమక్షంలో ఆకాష్ వాంగ్మూలంలో.. దర్గా నుండి హైదరాబాద్ చేరుకుని.. లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని మరో కారులోకి ఎక్కించాం. లాస్య తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లాం. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో నా మైండ్ బ్లాంక్ అయిందని తెలిపాడు.
లాస్య సోదరి నివేదిత ఫిర్యాదుతో ఆకాష్ మీద ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద పటాన్‌చెరు పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. శుక్రవారం వేకువఝామున ఉదయం 5గంటల 15 గంటలకు ఆకాష్ తమకు ఫోన్ చేశాడని, ప్రమాదం జరిగి.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడని నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నారు. సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చి.. కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాతే టిఫిన్ కోసం సంగారెడ్డి వైపు వెళ్లారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంలో లాస్య చనిపోగా.. ఆకాష్ కాళ్లు విరిగాయి. షామీర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి లాస్య కారు ఎంట్రీ అయినట్టు పోలీసులు గుర్తించారు.