జూన్ 11నుంచి భూముల డిజిటల్ సర్వే.. ముందుగా ఆ గ్రామాలే..
Land Digital Survey Starts From 11th June. రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
By Medi Samrat Published on 2 Jun 2021 8:23 PM ISTరాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాలనుంచి ఎంపిక చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆధేశించారు. డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు, ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణ కోసమే ధరణి పోర్టల్ ను అమలులోకి తెచ్చినం. భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకొని, వ్యాపారం కోణం లోంచి మాత్రమే కాకుండా సర్వేను రైతులకు సేవ చేసే ఉద్దేశ్యంతో సామాజిక సేవగా భావించి సర్వే నిర్వహించండని సర్వే ఏజెన్సీలకు సీఎం పిలుపునిచ్చారు.
పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాలల్లో, అంటే సమస్యలు లేని సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో అనుభవాన్ని గ్రహించాలన్నారు. తద్వారా పూర్తి స్తాయి సర్వేకు విధి విధానాలను ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశమున్నదని సీఎం అన్నారు.