'బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేధిస్తున్నాడు'.. మహిళా సర్పంచి ఆరోపణలు
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తోట రాజయ్యపై మహిళా సర్పంచి నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో చేసిన ఆరోపణలు
By అంజి Published on 21 Jun 2023 7:01 AM IST'బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేధిస్తున్నాడు'.. మహిళా సర్పంచి ఆరోపణలు
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తోట రాజయ్యపై మహిళా సర్పంచి నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమే చేశానంటూ సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం నాడు విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ గతంలో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచి కురుసపల్లి నవ్య ఆరోఫనలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే విషయమై ఎమ్మెల్యే రాజీకొచ్చి, గ్రామ అభివృద్ధి కోసం 25 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే తోట రాజయ్య, ఆయన అనుచరులు కొద్దిరోజుల క్రితం తనకు అగ్రీమెంట్ పేపర్‌ని పంపించారని తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమే గతంలో ఆరోపణలు చేశానంటూ దానిపై సిగ్నేచర్ పెట్టాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. తన భర్త కురుసపల్లి ప్రవీణ్‌పై ఒత్తిడి తెచ్చి, సిగ్నేచర్ పెట్టించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఒప్పంద పత్రంపై తాను సంతకం పెట్టనని, గ్రామాభివృద్ధి కోసం ఇస్తామన్న డబ్బులు కూడా వద్దని తేల్చిచెప్పారు. అప్పట్లో తనను ట్రాప్ చేయడానికి ప్రయత్నించిన మహిళ తన భర్తను వలలో వేసుకుని తనపై ఒత్తిడి చేయిస్తోందని సర్పంచి నవ్య ఆరోపించారు. ఎమ్మెల్యే రాజయ్య, ఆ మహిళతో పాటు తన భర్తపై కూడా పోలీస్ స్టేషన్‌లో, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని నవ్య తెలిపారు. దీంతో స్టేషన్‌నియోజకవర్గం ఎమ్మెల్యే రాజయ్యపై వస్తున్న ఆరోపణలకు మరోసారి ఆజ్యం పోసినట్లైంది.