తెలంగాణకు ద్రోహం చేయడమే..!
Kunamneni Sambasivarao Reacts On Kishan Reddy Comments. బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు చేయలేమని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు ద్రోహం
By Medi Samrat Published on 27 Sept 2022 6:59 PM IST
బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు చేయలేమని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు ద్రోహం చేయడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఉక్కు ప్యాక్టరీ, రాష్ట్ర విభజనలో పేర్కొన్న హామీలను సాధించే వరకు రాజ్‌భవన్, ఇతర కేంద్ర సంస్థల కార్యాలయాలను స్థంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజన గడిచి ఎనిమిదేండ్లు గడుస్తున్నా విభజన హామీల పరిష్కారంలో ఒక్క అడుగు ముందుకు పడలేదని కూనంనేని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజలపైన వున్న ఆగ్రహం కిషన్‌రెడ్డి ప్రకటనకు అద్ధం పడుతున్నదన్నారు.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు 25 సమావేశాలు జరుగాయని, ఈ రోజు మరో మారు సమావేశం జరుగుతున్నదని, సమావేశం జరుగుతుండగానే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలో బయ్యారం ఉక్కు కార్మాగారం సాధ్యం కాదని ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉక్కు ప్యాక్టరీపై ఈ విధంగా ప్రకటనలు చేయడం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమే అవుతున్నదని అన్నారు. నాణ్యత లేని ఇనుపు ఖనిజం బయ్యారంలో వున్నదని.. సాధ్యం కాదని కిషన్‌రెడ్డి చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అవుతున్నదన్నారు. నాణ్యత లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు రక్షణ స్టీల్ ప్లాంట్ పేరుతో ఒక లక్ష 41 వేల 691 ఎకరాల భూమిని ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.
ఆనాడు అసెంబ్లీలో నేను ఈ సమస్యను వెలుగులోకి తీసుకరావడం జరిగిందని, ఆ తరువాత ఇతర రాజకీయ పార్టీలు స్పందించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేయడం ద్వారా విభజన చట్టంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు కార్మాగారం కొరకు హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్రానికి చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 54 శాతం నుండి 65 శాతం (ఎఫ్.ఇ) నాణ్యత గలిగిన 300 మిలియన్ టన్నుల ఉక్కు బయ్యారంలో లభ్యమవుతుందన్నారు. అలాగే 2017లో హైదరాబాద్‌లో ఎన్.యం.డి.సి. డైమెండ్ జూబ్లీ ఉత్సవాలలో పాల్గొన్న ఆనాటి బిజెపికి చెందిన ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్ పెలటైజషన్ ఆధారిత కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారని, జియోలాజికల్ డిపార్టుమెంట్, కేంద్రమంత్రుల కంటే నాణ్యత విలువ కిషన్‌రెడ్డికి ఎలా తెలుస్తున్నదని ఎద్దేవా చేశారు.
బయ్యారంలో నాణ్యత గలిగిన ఉక్కులేదనే పేరుతో బయ్యారం ప్లాంట్‌ను తిరస్కరించిన బిజెపి ప్రభుత్వం, కాజీపేట కోచ్‌ప్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం మోపడం తప్ప మరొకటి కాదన్నారు. అలాగే విభజన చట్టం, షెడ్యూల్ 9లో 91 కార్పోరేషన్లు, షెడ్యూల్ 10లో వున్న 142 విద్యాసంస్థలకు సంబంధించిన సంస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది ఏండ్లు పూర్తయిన రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రమన్నా, తెలంగాణ ప్రజలన్నా కేంద్రలోని బిజెపి ప్రభుత్వానికి ఎంత ప్రేమ వుందో అర్థమవుతున్నదని సాంబశివరావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం డొల్ల ప్రకటనలు మానుకొని తక్షణమే బయ్యారం ఉక్కు ప్యాక్టరీ ప్రారంభించాలని, ఇతర విభజన హామీలను వెంటనే పరిష్కరించాలని లేని యెడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్దయెత్తన పోరాటం చేస్తామని, బయ్యారం సాధించేవరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాజ్‌భవన్ ముట్టడిలు జరుగుతూనే వుంటాయని కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.