ఫలితాలతో నిరాశ చెందా.. కానీ కాంగ్రెస్‌కు కంగ్రాట్స్: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  3 Dec 2023 3:29 PM IST
ktr, tweet,  congress, winning,  telangana,

ఫలితాలతో నిరాశ చెందా.. కానీ కాంగ్రెస్‌కు కంగ్రాట్స్: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కొన్ని స్థానాల్లో ఇప్పటికే విజయం సాధించిన కాంగ్రెస్.. మెజార్టీ స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇక అధికార పార్టీ బీఆర్ఎస్‌ నేతలు ఆశించినట్లుగా మాత్రం ఫలితాలు లేవు. ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో బిగ్‌ షాక్‌ తగిలింది. పలువురు మంత్రులు సైతం ఓటమిని ఎదుర్కొన్నారు. కామారెడ్డితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఓటమిని అంగీకరిస్తూ బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్‌కు ప్రభుత్వంలో ఉండే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. ఈ రోజు ఫలితం గురించి తాను బాధపడలేదని చెప్పారు. కానీ.. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందినట్లు కేటీఆర్ వెల్లడించారు. అయితే.. ఈ ఫలితం నుంచి మేం చాలా నేర్చుకుంటామని.. అన్నింటిపై సమీక్షించుకుంటామని కేటీఆర్ చెప్పారు. అలాగే రాబోయే కాలంలో తిరిగి పుంజుకుంటామని ట్వీట్‌ చేశారు. అలాగే ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి కూడా కేటీఆర్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌కు శుభం జరగాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు కేటీఆర్.

అలాగే కేటీఆర్ మరో ట్వీట్‌ కూడా చేశారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ.. కేటీఆర్‌ ఒక గన్‌ పట్టుకుని షూట్‌ చేస్తూ హ్యాట్రిక్‌ కొడతామంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. అయితే.. తాజా ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కేటీఆర్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసి.. అవును మీరు షూట్‌ చేశారు కానీ.. అవి మీ కారు టైర్లకే తగిలాయి. పూర్తిగా పంచర్‌లు అయ్యాయి అని విమర్శించింది. తాజాగా కేటీఆర్ కాంగ్రెస్‌ సెటైర్‌పైనా స్పోర్టీవ్‌గా స్పందించారు. తాము అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయమని చెప్పుకొచ్చారు.

Next Story