హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 'ఆరు గ్యారెంటీలను' కేవలం వాగ్దానాలకే పరిమితం చేయకుండా, వాటికి చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే శుక్రవారం అసెంబ్లీలో తాము ఈ గ్యారెంటీల అమలుపై 'ప్రైవేట్ మెంబర్ బిల్లు' ప్రవేశపెట్టబోతున్నామని, దీనికి అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఆరు గ్యారెంటీల ఫైలుపై సంతకం చేశారని, గవర్నర్ ప్రసంగంలో కూడా ఇదే అంశాన్ని చేర్చారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, ఆ సంతకం చేసిన ఫైలు ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ తమ ప్రైవేట్ బిల్లు చట్టంగా మారితే.. మహిళలకు రావాల్సిన రూ. 2,500 మహాలక్ష్మి పథకం, రైతులకు రూ. 15,000 రైతు భరోసా, మరియు విద్యార్థులకు విద్యా భరోసా వంటివి ప్రజల చట్టబద్ధమైన హక్కుగా మారుతాయని, అప్పుడు ప్రభుత్వం వీటిని ఎగ్గొట్టే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును ఆమోదించి చట్టం చేసిన ఉదాహరణలు ఉన్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఆరు గ్యారెంటీల్లో కనీసం 'అర' గ్యారెంటీ కూడా క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కాలేదని, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఘాటుగా విమర్శించారు.