'సుంకిశాల ఘటనను ఎందుకు దాచారు'.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్‌

సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ నేత విమర్శించారు. నాగార్జునసాగర్‌ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్‌ నగర ప్రజలకు విషాద వార్త అని అన్నారు.

By అంజి  Published on  9 Aug 2024 7:33 AM GMT
KTR, Telangana government , Sunkishala project, Hyderabad

'సుంకిశాల ఘటనను ఎందుకు దాచారు'.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ నేత విమర్శించారు. నాగార్జునసాగర్‌ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడకూలిపోవడం హైదరాబాద్‌ నగర ప్రజలకు విషాద వార్త అని అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అసమర్థత, చేతగానితనం చేవ లేని తనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వం తన తప్పు లేకుంటే ఎందుకు వారం రోజులపాటు దాచి ఉంచిందన్నారు.

అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆగస్ట్ 2 న ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం సమావేశాల్లో స్టేట్ మెంట్ చేయాలి కానీ అలా చేయలేదన్నారు. ఈ ప్రభుత్వానికి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియాదా? తెలిసి పట్టించుకోలేదా? అని ప్రశ్నించారు. ఒక వేళ ప్రభుత్వానికి ఈ విషయమే తెలియదంటే మాత్రం ఇది సిగ్గుచేటన్నారు. ఈ ప్రమాదం గురించి పక్కా ప్రభుత్వానికి తెలుసునని, కావాలనే వారం రోజులు గోప్యంగా ఉంచారని అన్నారు.

ప్రభుత్వం ఆగమాగం పనులు ప్రారంభిచంటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులే చెబుతున్నారని వివరించారు. అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమాదం జరిగిందని, లేకుంటే చాలా ప్రాణనష్టం జరిగేదన్నారు. మంచి జరిగితే మాది. చెడు జరిగితే బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు వద్దని సూచించారు. పురపాలక శాఖను పర్యవేక్షించకుండా ఉన్నా ముఖ్యమంత్రిదే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేటీఆర్‌ అన్నారు. సుంకిశాల ఘటనపై న్యాయ విచారణ చేయాలన్నారు.

ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాళేశ్వరం పైన చేసిన అడ్డగోలు వాదనలు తేలిపోయాయని, 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉందని తెలిపారు. కాళేశ్వరం ఫెయిలైతే అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. నీళ్ల విషయంలో కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఆరోపణుల చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం సాగు, తాగునీటికి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు కూడా వేగంగా చేశామన్నారు.

Next Story