ఫోన్‌ ట్యాప్‌లు కాదు.. వాటర్‌ ట్యాప్‌ల మీద దృష్టి పెట్టండి: కేటీఆర్‌

నీటి కొరతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) మండిపడ్డారు.

By అంజి  Published on  3 April 2024 6:17 AM GMT
KTR , CM Revanth, water crisis, free tankers, Telangana

ఫోన్‌ ట్యాప్‌లు కాదు.. వాటర్‌ ట్యాప్‌ల మీద దృష్టి పెట్టండి: కేటీఆర్‌

హైదరాబాద్: నీటి కొరతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) మండిపడ్డారు. సామాన్య ప్రజానీకానికి ఉచిత ట్యాంకర్ సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు చేసిందన్నారు. ఈ నీటి ఎద్దడి సహజ కారణం కాదని, గత ఏడాది 14% అధిక వర్షపాతం నమోదైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం నీటి సంక్షోభానికి దారితీసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

నీటి సంరక్షణకు చర్యలు తీసుకోకుంటే బెంగళూరు తరహా పరిస్థితి నెలకొంటుందని తెలంగాణ హైకోర్టు కొన్ని వారాల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే. సత్వర చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్న బెంగళూరు తరహాలోనే హైదరాబాద్‌కు కూడా ఎదురుదెబ్బ తగులుతుందని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. భూగర్భ జలాలను పెంచేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ జర్నలిస్టు పీఆర్ సుభాచంద్రన్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం నీటి కొరతతో అల్లాడే పరిస్థితి వచ్చిందని, తెలంగాణలోని ప్రతి గ్రామం, నగరం నీటి ట్యాంకర్లతో నిండిపోతున్నాయని కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల దగ్గర మహిళలు ఎండ వేడిమిలో ఎలా నిల్చున్నారో చూడంటూ పలు మీడియా కథనాలను చూపెడుతూ కేటీఆర్‌ మాట్లాడారు. 'బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించింది, కానీ ఎప్పుడూ నీటి కొరత లేదు. కేసీఆర్ రూ. 38,000 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేశారు. కానీ ఇప్పుడు, కొత్త ప్రభుత్వంలో, ప్రజలు రెట్టింపు డబ్బు చెల్లించి నీటి ట్యాంకర్లను కొనుగోలు చేయవలసి వచ్చింది' అని కేటీఆర్ తెలిపారు.

మంచి నీటి సరఫరా కోసం పని చేయకుండా.. పనికిమాలిన వ్యవహారమైన ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్‌రెడ్డి దృష్టి సారిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌పై నిందలు మోపడంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని కేటీఆర్ అన్నారు.

సమాచారం:

సింగూర్ డ్యామ్- 18TMC

ఉస్మాన్ సాగర్- 2.6 టీఎంసీలు

హిమాయత సాగర్ - 2.16TMC

నాగార్జున సాగర్- 513 టీఎంసీలు

నీటి ప్రాజెక్టులను కొందరు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని, నాగార్జున సాగర్‌ నుంచి నీరు కావాలంటే మరొకరిని అడుక్కోవాల్సి వస్తోందని, రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి హైదరాబాదు ఓట్లు వేయలేదని, ఇది హైదరాబాద్ ప్రజలపై పగా? అని ప్రశ్నించారు.

మార్చిలో వ్యవసాయ శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం, ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తక్కువ వర్షపాతం కారణంగా రాష్ట్రం కరువు పరిస్థితికి చేరుకుంది. నివేదికలో చూపిన సమాచారం ప్రకారం, అక్టోబర్ నుండి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల సగటు సాధారణ వర్షపాతం 113.20 మి.మీ. అయితే వాస్తవ వర్షపాతం 52.70 మి.మీ. -53.45% లోటు వర్షపాతం.

ఉచిత ట్యాంకర్లు అందించండి:

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో మార్చిలో 1.30 లక్షల ట్యాంకర్లు బుక్ చేసుకోగా, ప్రైవేట్ ట్యాంకర్లు లక్ష వరకు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రజలు డబ్బులు చెల్లించకుండా ట్యాంకర్లు ఉచితంగా అందించాలని రేవంత్ రెడ్డిని కేటీఆర్ కోరారు. నీటి కోసం బిల్లులు చెల్లించమని ప్రజలను అడగడం మానేయండి. ప్రజలకు 20 లీటర్ల నీటిని అందించండి అని కోరారు. నీటి కొరతతో బెంగళూరు ఎలా బాధపడుతోందో కర్ణాటక ప్రభుత్వంతో ఆయన పరిస్థితిని పోల్చారు.

ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదు:

ఫోన్ ట్యాపింగ్ కేసు ట్రెండింగ్ ఇష్యూపై మాట్లాడిన కేటీఆర్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. 2004 నుంచి పెండింగ్‌లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులను ప్రభుత్వం ప్రారంభించవచ్చు. గత ప్రభుత్వంలోని అధికారులందరినీ దించి, ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో తనిఖీ చేయండి అని కేటీఆర్ అన్నారు.

Next Story