సీఎం కేసీఆర్‌ను అవమానించే వారిపై కఠిన చర్యలు: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై కించపరిచే వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత రాష్ట్ర సమితి

By అంజి  Published on  22 March 2023 11:00 AM GMT
KTR , Telangana ,CM KCR

సీఎం కేసీఆర్‌ను అవమానించే వారిపై కఠిన చర్యలు: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై కించపరిచే వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ బుధవారం నాడు అన్నారు. ''బీజేపీ పాలిత కర్ణాటకలో అభ్యంతరకరమైన ట్వీట్ చేసినందుకు కన్నడ నటుడు చేతన్​ను 14 రోజుల జ్యుడీషియల్ ​కస్టడీకి పంపారు. తెలంగాణలో, మా సీఎం, మంత్రులు, శాసనసభ్యులను ప్రత్యక్షంగా, ఘోరంగా అవమానిస్తున్నా మేము సహిస్తున్నాము. బహుశా మేము కూడా కర్నాటక తరహాలోనే సమాధానం ఇవ్వాలేమో. దీనిపై మీరేమంటారు..? " అంటూ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌.. దూషించే స్వేచ్ఛ కాకూడ‌ద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై యూట్యూబర్ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత కేటీఆర్‌ ట్వీట్ వచ్చింది. మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్ శివార్లలోని పీర్జాదిగూడలోని తన ఛానెల్ క్యూ న్యూస్ కార్యాలయం నుంచి మల్లన్నను తీసుకెళ్లారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవితపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story