మంత్రి కేటీఆర్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లపై విమర్శలు గుప్పించారు. ఒకాయన సచివాలయాన్ని కూలగొడతానని అంటున్నాడని.. మేము మాత్రం నిర్మాణాలు చేద్దాం, పునాదులు తవ్వాలనుకుంటున్నామని కేటీఆర్ అన్నారు. వాళ్లలో ఒకాయన సమాధులు తవ్వుతామంటున్నారని, మరొకాయన బాంబులు పెట్టి పేల్చుతామంటున్నారని సెటైర్లు వేశారు. ఇలాంటి వాళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అసదుద్దీన్ ఓవైసీ కళ్లలో ఆనందం చూసేందుకుగాను సచివాలయాన్ని తాజ్ మహల్ మాదిరిగా నిర్మించారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తాము అధికారంలోకి రాగానే కొత్త సచివాలయంలో మార్పులు చేర్పులు చేస్తామని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపేడేలా సచివాలయంలో మార్పులు ఉంటాయని బండి సంజయ్ అన్నారు. ఇక ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేయాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పేదోళ్లకు ప్రవేశం లేని ప్రగతి భవన్ వుంటే ఎంత, లేకపోతే ఎంత అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం లేదని రేవంత్ అన్నారు.