ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గొడవపడితే కాంగ్రెస్‌పై నెపం నెట్టడం న్యాయమా? అంటూ మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిగ్గులేకుండా నీతిమాలిన రాజయం ఎందుకు చేస్తున్నారనంటూ ప్రశ్నించారు. ''అతి తెలివి మంత్రి గారు. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీ లోనే ఉన్నాడా లేక కాంగ్రెస్ లో ఉన్నాడా ?'' అని కేటీఆర్ నిలదీశారు.
''సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం. మరి మా బీఆర్‌ఎఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవరు? అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు ? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్ళను మా వాళ్ళు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. మీరు మీ అతితెలివితో హైకోర్టు ను మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు'' అని కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూరులో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గొడవపడితే కాంగ్రెస్ ఏం సంబంధమన్నారు. తమపై నిందలు వేయడం సరికాదని చెప్పారు. ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.