జగిత్యాలలో తన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయంగా హాట్ టాఫిక్‌గా మారాయి. కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్లే ఇటువంటి హత్యలు జరుగుతున్నాయని.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరైనా ఫిరాయిస్తే సస్పెండ్ చేసే చట్టం ఉందని.. పార్టీ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రమైన చర్చ జరుగుతుండగా.. కేటీఆర్ కూడా కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు.
ఈ మేరకు కేటీఆర్ ట్వీట్‌లో.. రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే.. మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు.. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా.? అని చురకలంటించారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే.. ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని.. మీ దిగజారుడు రాజకీయాలపై.. దుమ్మెత్తి పోశారు.. ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా ? క్షమాపణ చెబుతారా.? అని ప్రశ్నించారు. మీరు గడప గడపకు వెళ్లి.. చేర్చుకున్న BRS ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా.? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా.? ప్రోత్సహించిన మిమ్ములనా.? అని విమర్శనాస్త్రాలను సంధించారు.