ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించండి

KTR Fire On Center For Petrol Prices. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై

By Medi Samrat
Published on : 24 Aug 2022 9:00 PM IST

ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించండి

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తగ్గిన ముడిచమురు ధరల మేరకు పెట్రో రేట్లు తగ్గించాలని మోదీని డిమాండ్ చేశారు. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు పెరిగినా, త‌గ్గినా దేశంలో మాత్రం పెట్రో దోపిడీ ఆగ‌డం లేద‌న్నారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను తగ్గించడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే దేశ ప్రజల నుంచి రూ. 26 లక్షల కోట్లకు పైగా కేంద్రం వసూలు చేసిందని.. ఈ పెట్రో పన్నులను ప్రజల నుంచి గుంజి, కార్పోరేట్ల రుణాల మాఫీకి వాడుకుంటున్నద‌ని కేటీఆర్ ఆరోపించారు. చట్టాన్ని మార్చుకుని మరీ సెస్సులు, సుంకాల పేరుతో భారీగా దోపిడీ చేస్తున్నారన్నారు. పెంచిన కొండంత ధరలను నామమాత్రంగా తగ్గించి, పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని, ఇది ముమ్మమాటికీ నయవంచనకు పరాకాష్టనే అని కేటీఆర్ అన్నారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు వంద డాలర్లకు కన్నా దిగువకు భారీగా తగ్గుతున్నా, ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం పెట్రో భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

మోదీ నాయకత్వంలోని కేంద్రం, పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడిచమురు ధరలు కారణమంటూ చేస్తున్న వాదనలో అబద్ధాలు మరోసారి బయటపడిందన్నారు కేటీఆర్. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్యారెల్ ముడి చమురు ధర భారీగా తగ్గుతూనే వచ్చిందని, కానీ ఘనమైన మోదీ పాలనలో, దేశంలో పెట్రో రేట్లు మాత్రం పెరుగుతూ పోయాయన్నారు. రేట్లు పెంచిన ప్రతిసారి అంతర్జాతీయ ముడి చమురు ధరలను బూచీగా చూపడం అలవాటుగా మారిందని మండిపడ్డారు.


Next Story