బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఉద్యమ పార్టీగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, అధికార పార్టీగా ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి ప్రతిపక్షంలో ప్రజల పక్షాన సమరశంఖం పూరించి సమాజమిచ్చిన ప్రతి బాధ్యతను ఓ పవిత్ర యజ్ఞంలా అకుంఠిత దీక్షతో, పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తున్నాం. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా.. 4 కోట్ల ప్రజల కోసం పునరంకితమవుదాం.. బీఆర్‌ఎస్ జెండాను సమున్నత శిఖరాలకు చేరుద్దాం' అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
'పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేళ.. తొలిరోజు నుంచి కేసీఆర్‌తో కలిసి కదంతొక్కిన ఉద్యమకారులకు, గులాబీ జెండాను తమ భుజాలపై మోసిన సైనికులకు భాగస్వాములైన ప్రతిఒక్కరికీ పేరుపేరునా అభినందనలు' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అటు ఇవాళ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వేదిక ముస్తాబైంది. భారీ ఎత్తున మహాసభ ఏర్పాట్లు చేశారు. ‘చలో వరంగల్’ అంటూ సభ వైపు సాగుతున్న బీఆర్‌ఎస్ సేనలు.. ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తిస్తున్నాయి. సభ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో హెల్ప్‌లైన్ నంబర్ 90142 06465 ఏర్పాటు చేశారు.