ఆ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డమ్మీలను నిలబెట్టింది : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో డమ్మీలను నిలబెట్టిందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు
By Medi Samrat Published on 26 Nov 2023 9:30 AM GMTకాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో డమ్మీలను నిలబెట్టిందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గోషామహల్, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపించారు. గోషామహల్‌లో ఈసారి బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతుబంధు సాయంపై విమర్శలు చేస్తున్నారని, కానీ అది కొత్త పథకం కాదని గుర్తించాలన్నారు. నవంబర్ 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడి వారు అక్కడే దీక్షా దీవస్‌ను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని సూచించారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్ అభ్యర్థుల పైన మాత్రమే జరుగుతున్నాయని చెప్పడం సరికాదని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ రాజకీయ నిరుద్యోగిగా మారిపోయారని, 2014 నుంచి ఆయనకు ఉద్యోగం లేదని ఎద్దేవా చేశారు. ఈ పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం లేదని అన్నారు.
ఇక కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈసీ నోటీసులు పంపించింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్ కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సూర్జేవాలా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులలో పేర్కొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను ఉపయోగించుకున్నారని సూర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.