రైతు రుణమాఫీపై.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూస్తే ఆయన చిరాకులో ఉన్నట్టు అర్థమవుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 16 Aug 2024 4:01 PM ISTరైతు రుణమాఫీపై.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూస్తే ఆయన చిరాకులో ఉన్నట్టు అర్థమవుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం చెప్పేవరకు భాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని తమకు తెలియదని సెటైర్లు వేశారు. కొడంగల్‌లో అయినా, వేరే ఏ ఊర్లోనైనా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందని చెబితే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీనిపై మీడియా చర్చకు రావాలన్నారు.
''మీరూ (సీఎం రేవంత్) చేసిన రుణమాఫీ నిజమైతే.. నీ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దాం. ఒక్క రైతు వేదికలో వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పిన నేను రాజకీయాలను వదిలేస్తా. సీఎంకు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నా. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే రేవంత్ రెడ్డిని ప్రజలు ఫుట్బాల్ ఆడుతారు. సగం కూడా రుణమాఫీ చేయకుండా మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెబితే అది సంపూర్ణంగా దిగజారటమే. రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా. రైతులను మోసం చేసినందుకు సీఎం పై చీటింగ్ కేసు పెట్టాలె. రేవంత్ రెడ్డి పిచ్చి, పిచ్చి మాటలు మానేయాలి. నువ్వు రైతుల దగ్గరకు పోతే వాళ్లు నీతో చెడుగుడు ఆడుతారు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి, దివాళా తీసిన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు'' అని కేటీఆర్ అన్నారు.
రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో రైతులను మోసం చేసినందుకు రేవంత్‌పై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. సీఎం మాటలు చూస్తే మానసిక పరిస్థితి మీద అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా కుటుంబ సభ్యులు ఆయన్ను సరిగ్గా చూసుకోవాలని కోరారు. రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాటి మాటికి ఢిల్లీ వెళ్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఇప్పటి వరకు 19 సార్లు సీఎం ఢిల్లీ వెళ్లారని, తనకు తెలిసి ఇదో రికార్డ్ అని అన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఇన్నిసార్లు ఢిల్లీ పోయినట్టు లేదన్నారు. పాపం సీఎం రేవంత్ ఇంకెన్నిసార్లు వెళ్లాలో అని కేటీఆర్ సెటైర్ వేశారు. ప్రభుత్వ టీచర్లను పట్టుకుని సీఎం స్థాయి వ్యక్తి ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్లు అని మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.