మెడికల్ విద్యలో సీఎం కేసీఆర్ గొప్ప చరిత్ర సృష్టించారన్నారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 8 ఏళ్లలోనే 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎన్ని కాలేజీలు మంజూరు చేసిందో ప్రధాని నరేంద్ర మోదీ ఆన్సర్ చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. 2014కు ముందు 67 ఏళ్లలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే తెలంగాణలో ఏర్పాటు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రకారం.. ప్రభుత్వం మరో 13 కాలేజీలు ఏర్పాటు చేయనన్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు.
మహబూబ్‌నగర్‌లో మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుందని తెలిపారు. ఇక సంగారెడ్డి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిపారు. అలాగే వనపర్తి, రామగుండం, జగిత్యాల మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా దాదాపు పూర్తైనట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నాగర్ కర్నూలు మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా దాదాపు పూర్తైందని తెలిపారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ వైద్య కాలేజీలు పనిచేయడం ప్రారంభమయ్యాయని అన్నారు. త్వరలో కొత్తగూడెం వైద్య కళాశాల ప్రారంభోత్సవం చేసుకోబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రం 2014లో మిగులు బడ్జెట్‌తో ఏర్పడిందని, నేటికీ మిగులు బడ్జెట్‌లోనే ఉందని ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు.