తాము అమల్లోకి తీసుకొచ్చిన అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం నిజంగా దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని భావించినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అల్పాహార పథకాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం తమ అనాలోచిత నిర్ణయాన్ని పునఃపరిశీలించి అల్పాహార పథకాన్ని అమలు చేయాలని అభ్యర్థించారు.
తమిళనాడులోని ఎయిడ్ స్కూళ్లలో కూడా ఉచితంగా అల్పాహారం అందించే కార్యక్రమాన్ని సీఎం స్టాలిన్ సోమవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 6న సర్కారు బడుల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్‌లో అప్పటి మంత్రి సబితా రెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అల్పాహార పథకాన్ని అమలు చేయడం లేదు.