హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డులతో దూసుకెళ్తోంది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) కాలనీలోని ఒక స్థలానికి ఎకరాకు ఏకంగా రూ. 70 కోట్లు పలికి, రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. హౌసింగ్ బోర్డు భూముల వేలంతో ప్రభుత్వానికి రూ. 547 కోట్ల ఆదాయం చేకూరింది. హౌసింగ్ బోర్డు వేలం నిర్వహించగా.. ప్రముఖ సంస్థలు పోటీపడి మరీ ఈ స్థలాన్ని దక్కించుకున్నాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎకరా రూ. 70 కోట్ల చొప్పున మెుత్తం 7 ఎకరాల 33 గుంటల స్థలాన్ని రూ. 547 కోట్లకు దక్కించుకుంది. హైటెక్ సిటీకి సమీపంలో ప్రముఖ బహుళ అంతస్తుల భవనాల మధ్య ఉన్న కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో 7 ఎకరాల 33 గుంటల స్థలాన్ని తెలంగాణ హౌసింగ్ బోర్డు బుధవారం (ఆగస్టు 20న) ఈ-వేలం నిర్వహించింది.
ఈ స్థలానికి కనీస ధరను ఎకరాకు రూ. 40 కోట్లుగా నిర్ణయించారు. గోద్రెజ్ ప్రాపర్టీస్, అరబిందో రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ వేలంలో పాల్గొన్నాయి. 46 సార్లు ధరను పెంచుతూ హోరాహోరీగా పోటీపడగా.. చివరకు గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎకరాకు రూ. 70 కోట్ల చొప్పున మొత్తం రూ. 547 కోట్లకు ఈ స్థలాన్ని దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని పేద, మధ్యతరగతి ప్రజల గృహనిర్మాణ పథకాలకు వినియోగిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు.