హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదు అంటూ కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ పై థాక్రే వివరణ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని భారత్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ లో పాదయాత్ర చేస్తుండగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే పొత్తు విషయాలను ఎందుకు మాట్లాడారనే దానిపై తాజాగా కోమటిరెడ్డి నుంచి థాక్రే వివరణ కోరనున్నట్టు సమాచారం.
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని.. అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. హంగ్ వస్తుందని కోమటిరెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్, బీఆర్ఎస్ చేతిలోనే సురక్షితంగా ఉంటుందని అన్నారు.