కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆడియో క‌ల‌క‌లం.. త‌మ్ముడు రాజ‌గోపాల్‌కి ఓటేయాలంటూ..

Komatireddy Venkatreddy Audio Leak. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది పొలిటిక‌ల్ హీట్ పెరుగుతుంది.

By Medi Samrat  Published on  21 Oct 2022 9:28 AM GMT
కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆడియో క‌ల‌క‌లం.. త‌మ్ముడు రాజ‌గోపాల్‌కి ఓటేయాలంటూ..

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది పొలిటిక‌ల్ హీట్ పెరుగుతుంది. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, మ‌ద్యం, డ‌బ్బు పంపిణీ, లీడ‌ర్లు పార్టీ కండువాలు మార్చ‌డం వంటివి చూస్తున్నాం. అవ‌న్ని ఒక ఎత్త‌యితే.. నేడు కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కి ప‌డే మ‌రో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. మునుగోడు ఉప ఎన్నిక‌కు కార‌ణ‌మైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్న, క‌రుడుగ‌ట్టిన‌ కాంగ్రెస్ నేత‌, టీపీసీసీ స్టార్ క్యాంపెయిన‌ర్, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆడియో లీక్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న త‌మ్ముడికి ఓటేయాల‌ని కోర‌డం మునుగోడుతో పాటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతుంది.

రేవంత్ పీసీసీ ఛీప్ అయిన‌ప్ప‌టి నుండి పార్టీకి అంటిముట్ట‌నట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న వెంక‌ట్ రెడ్డి త‌మ్ముడి రాజీనామాతో మ‌రింత దూర‌మ‌య్యారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్య‌ర్ధిని పాల్వాయి స్ర‌వంతి ప్ర‌చారానికి పార్టీ పెద్ద‌లు పిలిచినా రాక‌పోవ‌డమే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

వైర‌ల్ అయిన ఆ ఆడియోలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కాంగ్రెస్ నేత‌ల‌కు ఫోన్ చేసి.. త‌న త‌మ్ముడు, బీజేపీ అభ్య‌ర్ధి రాజ‌గోపాల్ రెడ్డికి ఓటేయాల‌ని కోరారు. అంతేకాకుండా.. ఈ దెబ్బ‌తో తాను పీసీసీ ఛీప్ అవుతాన‌ని.. రాష్ట్ర‌మంతా పాద‌యాత్ర చేస్తాన‌ని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గ‌వ‌ర్న‌మెంట్‌ను తీసుకొస్తాన‌ని.. ఏమైనా ఉంటే తాను చూసుకుంటాన‌ని వెంక‌ట్‌రెడ్డి హామీ ఇవ్వ‌డం పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతుంది.

ఇదిలావుంటే.. నిన్న జ‌రిగిన మీడియా సమావేశంలో.. నన్ను ఒంటరివాణ్ని చేశారని రేవంత్ రెడ్డి కన్నీటి పర్వంతమైన విష‌యం తెలిసిందే. నా మీద కక్ష ఎందుకు..? పిసిసి పదవి కోసం ఇన్ని కక్షలా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఆయ‌న‌ మనసులో బాధ చెబుతూ.. త‌న‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి ఉద్వేగ భరితంగా మాట్లాడిన నేప‌థ్యంలో వెంక‌ట్ రెడ్డి ఆడియో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది.


Next Story